ఆప్ ఆరోపణలు నిరాధారం.. సిసోడియా హత్య కుట్ర ఆరోపణలపై స్పందించిన జైలు అధికారులు..
ఢిల్లీ మాజీ మంత్రిని చంపేందుకు జైలులో ప్రణాళికలు రచించారనే ఆప్ ఆరోపణలను జైలు అధికారులు కొట్టిపారేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రిని చంపేందుకు జైలులో ప్రణాళికలు రచించారనే ఆప్ ఆరోపణలను జైలు అధికారులు కొట్టిపారేశారు. ఆయనకు కేటాయించిన సెల్ సాధారణ ఖైదీలే ఉన్నారని వారిలో గ్యాంగ్ స్టర్లు వంటి వారు లేరని జైళ్ల శాఖ తెలిపింది. ‘ప్రత్యేక సెల్ ఆయనకు ఎటువంటి ఆటంకం లేకుండా ధ్యానం చేయడానికి లేదా అలాంటి ఇతర కార్యకలాపాలను చేయడానికి వీలు కల్పిస్తుంది. జైలు నిబంధనల ప్రకారం.. ఆయన భద్రతను నిర్ధారించడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.
ఆయనకు జైలులో వసతి కేటాయింపులపై వస్తున్న వార్తలు నిరాధారం’ అని పేర్కొంది. అంతకుముందు ఆప్ జైలులో సిసోడియా కు గది కేటాయింపుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనతో ఉన్న ఖైదీలతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. అంతేకాకుండా మాజీ మంత్రి కి విపాసన గదిని కేటాయించలేదని ఆరోపించింది. లిక్కర్ స్కాం లో అవినీతి ఆరోపణలతో మనీష్ సిసోడియా ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.