Delhi Police : అంతర్రాష్ట్ర అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ గుట్టురట్టు

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్రమ కిడ్నీ మార్పిడి మాఫియా గుట్టు రట్టయింది.

Update: 2024-07-19 16:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్రమ కిడ్నీ మార్పిడి మాఫియా గుట్టు రట్టయింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయిస్తున్న ముఠాకు చెందిన ఎనిమిది మందిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మాఫియాపై జూన్ నెలాఖరులో పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై విచారణ జరుపుతుండగా ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఈ ముఠా ప్రధాన నిర్వాహకుడు సందీప్ ఆర్యతో పాటు విజయ్ కుమార్ కశ్యప్ పేరు వెలుగులోకి వచ్చింది. రూ.35 లక్షలతో కిడ్నీ మార్పిడి చేయిస్తామని చెప్పి తన భర్తను ముఠా సభ్యులు మోసగించారని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు సదరు మహిళ కంప్లయింట్ ఇచ్చింది. దీంతో గత నెల 26వ తేదీ నుంచి దర్యాప్తులో వేగాన్ని పెంచారు.

తాజాగా గోవాలో ఈ ముఠా కింగ్ పిన్ సందీప్ ఆర్యతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరిని టార్గెట్ చేసి.. రూ.5 లక్షలకు కిడ్నీని కొనేవారని విచారణలో తేలింది. అదే కిడ్నీని ఇతరులకు సర్జరీ ద్వారా మార్పిడి చేయడానికి ఈ మాఫియా నిర్వాహకులు సర్జరీ ఖర్చును కలుపుకొని రూ.35 లక్షల నుంచి 40 లక్షల దాకా తీసుకునేవారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు సమీప బంధువు, కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీని పొందొచ్చు. కానీ ఎలాంటి బంధుత్వం లేని వాళ్లను కూడా బంధువులుగా చూపించేలా ఈ ముఠా సభ్యులు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి అక్రమంగా కిడ్నీ మార్పిడి సర్జరీలు చేయించేవారు. వివిధ రాష్ట్రాల్లోని 11 ఆస్పత్రులతో ఈ ముఠా సభ్యులు టచ్‌లో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా జరిగిన 34 అక్రమ కిడ్నీ మార్పిడి కేసులను గుర్తించారు.

Tags:    

Similar News