వర్చువల్ విచారణ.. జడ్జిపై నోరుపారేసుకున్న మహిళపై కోర్టు ధిక్కారం కేసు

దిశ, నేషనల్ బ్యూరో : సాక్షాత్తూ జడ్జీపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించినందుకు ఒక మహిళపై ఢిల్లీ హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కార కేసును నమోదు చేసింది.

Update: 2024-01-19 15:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సాక్షాత్తూ జడ్జీపై అనుచిత పదజాలాన్ని ఉపయోగించినందుకు ఒక మహిళపై ఢిల్లీ హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కార కేసును నమోదు చేసింది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసు ఏమిటంటే.. అనితా కుమారి గుప్తా అనే మహిళ ఆస్ట్రేలియా నుంచి వర్చువల్ కాన్ఫరెన్సింగ్ ద్వారా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నీనా బన్సల్ కృష్ణ ఎదుట విచారణకు హాజరైంది. అయితే ఆమె వర్చువల్‌గా జాయిన్ అయ్యాక.. మరొకరి పిటిషన్‌పై విచారణ మొదలైంది. దీంతో చిరాకుపడిన అనితా కుమారి గుప్తా అసభ్యంగా మాట్లాడింది. ‘‘ఐటం నంబర్ 10 కంటే ముందు ఐటం నంబర్ 11 ఎలా తీసుకుంటారు... ఈ జడ్జి(అసభ్య పదం వాడారు) ఏం చేస్తున్నారు ? ఈ కోర్టులో అసలేం జరుగుతోంది?’’ అని అనిత విరుచుకుపడింది. దీంతో జస్టిస్ కృష్ణ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఏప్రిల్ 16న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. విచారణకు నిర్ణయించిన తేదీ కంటే ముందే గుప్తా భారతదేశానికి వస్తే పాస్‌పోర్ట్/వీసాలను జప్తు చేయాలని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్‌ఆర్‌ఓ)కు నిర్దేశించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు లేకుండా అనితా కుమారి గుప్తా దేశం విడిచి వెళ్లడానికి అనుమతించరాదని జస్టిస్ కృష్ణ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వును భారత కాన్సులేట్ జనరల్ ద్వారా అనితా కుమారి గుప్తాకు తెలియజేయాలని ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్న భారత హైకమిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా, అనిత ప్రస్తుతం సిడ్నీలో నివసిస్తున్నారు.

Tags:    

Similar News