బీబీసీ డాక్యుమెంటరీ కేసులో విచారణ నుంచి తప్పుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

తాను ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన పేర్కొనలేదు.

Update: 2024-05-17 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రతిష్ఠను దెబ్బతీసేలా బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ పేరిట డాక్యుమెంటరీని విడుదల చేసిందని ఆరోపిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం విరమించుకున్నారు. ప్రధాని మోడీతో పాటు భారత న్యాయవ్యవస్థ పరువుకు భంగం కలిగించేలా బీబీసీ అవాస్తవాలతో కూడిన డాక్యుమెంటరీ రూపొందించిందని గుజరాత్‌కు చెందిన ఎన్జీవో తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రధాని మోడీ, భారత, గుజరాత్‌ ప్రభుత్వాల ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ డాక్యుమెంటరీ ఉందంటూ రూ.10 వేల కోట్లకు ఆ సంస్థ దావా వేసింది. అయితే, తాను ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నానని జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన పేర్కొనలేదు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలకు లోబడి మే 22న విచారణ కోసం మరో బెంచ్ ముందు పిటిషన్‌ను లిస్టింగ్ చేయనున్నట్టు కోర్టు పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన వివాదాస్పద లఘుచిత్రంపై గుజరాత్‌కు చెందిన ఎన్‌జీఓ కేసు వేసింది. ఆ కేసు విచారణలో భాగంగా గతంలో బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు కూడా జారీ చేసింది. ఈ డాక్యుమెంటరీ ప్రసారమైన సమయంలోనే బీబీసీ ఇండియా కార్యాలయంలో ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. ఈడీ సైతం కేసు నమోదుచేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది. డాక్యుమెంటరీ విడుదలైన వెంటనే ప్రభుత్వం దానిపై నిషేధం కూడా విధించింది. 

Tags:    

Similar News