Delhi coaching centre deaths: ప్రమాద దృశ్యాలు వైరల్.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్
ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి చనిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో (Coaching Centre) ముగ్గురు విద్యార్థులు వరద నీటిలో మునిగి చనిపోయారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విషయం తెలిసిందే. బయట వీధిలో భారీగా నీరు నిలిచిపోవడంతో కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ ఎలా నీటితో నిండిపోయిందో వీడియోలో కన్పిస్తుంది. కోచింగ్ సెంటర్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇనుప గేటు నేలమాళిగలోకి వరదనీరు చేరకుండా అడ్డుగా పెట్టారు. అయితే, కోచింగ్ సెంటర్‌లో వేగంగా కారు వెళుతుండగా వరదనీరు తాకిడికి ఇనుపగేటు తొలగిపోయింది. దీంతో, సెల్లార్ అంతా నీటితో నిండిపోయింది. మరొక వీడియోలో కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులు బయటికి పరుగెత్తడం చూడవచ్చు. ఇంకెవరైనా ఉన్నారా అని కూడా అడగడం వీడియోలో వినబడుతోంది. అయితే మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చేలోపే వరద చుట్టిముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇలా చట్ట విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 27న జరిగిన ఈ ఘటనలో తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డెల్విన్ (28) అనే ముగ్గురు అభ్యర్థులు మరణించారు.
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఇదిలా ఉండగా, ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారులను ఢిల్లీ పోలీసులు విచారించనున్నట్లు తెలిసింది. అధికారులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను మెజిస్టీరియల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వీరిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు. సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు.
13 కోచింగ్ సెంటర్లు సీల్
ఇకపోతే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ కోచింగ్ సెంటర్లపై చర్యలు ప్రారంభించింది. స్టడీ సర్కిల్ లో ముగ్గురు విద్యార్థుల మృతికి కారణం, సెల్లార్ లోకి వరద రావడంపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న అనేక కోచింగ్ సెంటర్లను సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి వరకు దాదాపు 13 కోచింగ్ సెంటర్లను సీల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడుపుతుండటంతోనే సీల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.