రూ.1600 కోట్లు ఖర్చు చేస్తే పేదది అయిపోదు.. ప్రధానిపై కేజ్రీవాల్ సెటైర్లు

రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Update: 2023-04-03 06:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న ఛార్జీల రాయితీలను పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కరోనా కారణంగా నిలిపివేయబడిన సీనియర్ సిటిజన్ రాయితీని పునరుద్ధరించాలని కేజ్రీవాల్ తన లేఖలో కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది వృద్ధులకు ఈ రాయితీ ప్రయోజనం చేకూరుస్తోందని, ఈ రాయితీని నిలిపివేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. 50 శాతం రైల్వే రాయితీ దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు సహాయం చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. రైల్వే రాయితీని తొలగించడం ద్వారా కేంద్రం రూ.1,600 కోట్లు ఆదా చేస్తోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో వెల్లడించిందని గుర్తుచేశారు.

వచ్చే ఏడాది కాలంలో, కేంద్ర ప్రభుత్వం 45 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని.. అందులో 1600 కోట్ల రూపాయలు మాత్రమే రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు రాయితీల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని ఖర్చు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ధనవంతురాలు అయిపోదంటూ విమర్శించారు. ఇది డబ్బు గురించి కాదని, కేవలం ఉద్దేశ్యం గురించి మాత్రమేనని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తన రూ. 70,000 కోట్ల బడ్జెట్‌లో రూ. 50 కోట్లను తీర్థయాత్రకు ఖర్చు చేసిందని, దీనివల్ల ప్రభుత్వం పేదది అయిపోదు కదా అంటూ సెటైర్లు వేశారు.

Tags:    

Similar News