Gujarat : అంత్యక్రియలు జరిగాక.. తిరిగొచ్చాడు.. అందరూ అవాక్కు
దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్(Gujarat)లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్(Gujarat)లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నవంబరు 10న అంత్యక్రియలు జరిగిన వ్యక్తి జ్ఞాపకార్థం.. ఈనెల 15న మెహసానా పట్టణంలో ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన ఓ వ్యక్తిని చూసి అందరూ అవాక్కయ్యారు. కాసేపటి వరకు ఎవరి నోటా మాట పెగలలేదు. ఇంతలా అందరినీ ఆశ్చర్యపర్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు.. నవంబరు 10న అంత్యక్రియలు జరిగిన వ్యక్తే !! ఔను.. అందరూ చనిపోయాడని భావిస్తున్న 43 ఏళ్ల బ్రిజేష్ సుథార్(Brijesh Suthar) డైనమిక్‌గా నడిచొచ్చాడు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ‘‘ఇంతకీ ఏమయ్యావ్.. ఎక్కడికి పోయావ్ ?’’ అని బ్రిజేష్‌ను వారు అడిగితే.. ‘‘ఆర్థిక, మానసిక సమస్యలతో మనస్తాపానికి గురై నరోడాలోని ఇంటి నుంచి వెళ్లిపోయాను’’ అని చెప్పాడు.
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. నరోడా పట్టణానికి చెందిన బ్రిజేష్ అక్టోబర్ 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 10న సబర్మతీ వంతెన సమీపంలో ఒక కుళ్లిపోయిన డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. దాన్ని బ్రిజేష్ కుటుంబ సభ్యులకు చూపించగా.. శరీరం ఆకారం పోలి ఉండటంతో తమవాడేనని చెప్పారు. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఇప్పుడు బ్రిజేష్ సుథార్ తిరిగొచ్చాడని తెలిసి పోలీసులు కూడా షాకయ్యారు. తాము బ్రిజేష్ కుటుంబానికి అప్పగించిన డెడ్‌బాడీ ఎవరిది అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు.