Economic Survey 2023-24: జీడీపీ 6.5 నుంచి 7 శాతం మధ్య పెరుగుతుందని అంచనా

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు

Update: 2024-07-22 07:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 2024-25లో జీడీపీ(GDP) 6.5 నుంచి 7 శాతం మధ్య పెరుగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Finance Minister Nirmala Sitharaman) పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాదికి గానూ ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీంతో, ఆర్థిక సర్వేను (Economic Survey)సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ దేశీయంగా ఆర్థిక వృద్ధి జరుగుతుందని పేర్కొంది. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ వైరుధ్యాలు.. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన వైఖరిని ప్రభావితం చేయవచ్చంది. ప్రపంచ దిగుమతులు, ఇతర పరిస్థితులను చూస్తే ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం ఉందంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ.. భారతదేశం సవాళ్లను అధిగమిస్తోంది తెలిపింది. ఇకపోతే, గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్‌ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్‌ డివిజన్‌ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.

ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే?

• ప్రపంచ ఆర్థిక తీరులో అనిశ్చితి ఉన్నప్పటికీ దేశ వృద్ధి కారకాలు ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చాయి.

• ప్రపంచ భౌగోళిక, రాజకీయ వైరుధ్యాల పెరుగుదల, దాని ప్రభావం ఆర్బీఐ(RBI) ధ్రవ్యవిధాన వైఖరిపై ఉంటుంది.

• సాధారణంగానే రుతుపవనాలు(monsoon) ఉంటాయని అంచనా వేసింది. దిగుమతులు, ప్రపంచ ధరల నియంత్రణ, ఆర్బీఐ ద్రవ్యోల్బణ(inflation) అంచనాలకు విశ్వసనీయతను చేకూరుస్తుంది.

• ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పటికీ ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ భారతదేశం సవాళ్లను అధిగమించింది.

• పన్ను ప్రయోజనాలు, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్(digitisation) భారతదేశం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కటి సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయి.

• ఆర్థిక రంగం క్లిష్ట పరివర్తనకు లోనవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా లేదా స్థానికంగా ఉత్పన్నమయ్యే గడ్డు పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలి.

• భారతదేశ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు ప్రముఖమైనవి. ప్రపంచ భౌగోళిక, రాజకీయ ఆర్థిక విపరీతాలను తట్టుకుంటుంది.

• కార్పొరేట్‌, బ్యాంకింగ్‌ బ్యాలెన్స్ షీట్స్‌ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

• ఏఐ ప్రభావం అన్ని రంగాల కార్మికులపై ఉంటుంది. దీని వల్ల భారీ అనిశ్చితి కలిగిస్తుంది.

• స్వల్పకాలిక ద్రవ్యోల్బణం ఉంటుంది. భారతదేశం పప్పుధాన్యాల్లో నిరంతర లోటును ఎదుర్కొంటుంది. దాని ప్రభావం ధరలపై ఉంది.

• పెరిగిన చైనా ఎఫ్‌డీఐలు ప్రపంచంలో భారత సప్లయ్‌ చైన్‌లో భాగాస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుంది.

• అనారోగ్యకరమైన ఆహారం కారణంగా 54 శాతం వరకు వ్యాధులు వస్తున్నాయి. సమతుల్య, వైవిధ్యమైన ఆహారం వైపు మార్పు అవసరం.

Tags:    

Similar News