Criminal laws: కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించాలి..బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం

జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది.

Update: 2024-08-01 15:13 GMT
Criminal laws: కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించాలి..బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మోలోయ్‌ ఘటక్‌, ఇతర తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు తీసుకొచ్చిన ఈ తీర్మానంపై రెండు రోజుల పాటు సుధీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ‘సుపరిపాలన ప్రయోజనాల కోసం న్యాయనిపుణులు, సామాజిక కార్యకర్తలు, పౌరుల ఏకాభిప్రాయ అభిప్రాయాలను రూపొందించాలి. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను పరిరక్షించడానికి కొత్త చట్టాలను సమీక్షించాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ అంశంపై చర్చ సందర్భంగా మోలోయ్ ఘటక్ మాట్లాడుతూ.. ఈ మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయన్నారు. లా కమిషన్‌తో సంప్రదించకుండా వీటిని ఆమోదించినందున టీఎంసీ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తుందని చెప్పారు.

సీఎం మమతా బెనర్జీ ఈ చట్టాలపై లా కమిషన్ తో సంప్రదింపులు జరపాలని ఒత్తిడి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలకు సస్పెండ్ చేసి ఈ చట్టాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. ఈ మూడు చట్టాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించారు. మరోవైపు ఈ తీర్మానాన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి మాట్లాడుతూ ఈ తీర్మానం తీసుకురావడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదని, ఈ చట్టాలను ఆపలేరని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఇచ్చిన ఉమ్మడి జాబితా కింద కేంద్రప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి మూడు చట్టాలను రూపొందించిందని తెలిపారు. కాగా, భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News