బుల్లెట్ రైలు కోసం 1.75 లక్షల నాయిస్ బారియర్‌ల ఏర్పాటు

దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా వేగంగా వెళ్తున్న రైలు, ట్రాక్ నుంచి వచ్చే భారీ సౌండ్‌ను తగ్గించడానికి ఒక్క గుజరాత్‌లోనే 1,75,000కు పైగా నాయిస్ బారియర్‌లను ఏర్పాటు చేశారు.

Update: 2024-09-10 14:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా వేగంగా వెళ్తున్న రైలు, ట్రాక్ నుంచి వచ్చే భారీ సౌండ్‌ను తగ్గించడానికి ఒక్క గుజరాత్‌లోనే 1,75,000కు పైగా నాయిస్ బారియర్‌లను ఏర్పాటు చేశారు. 87.5 కిలోమీటర్ల మార్గంలో వీటిని అమర్చారు. ప్రతి కిలోమీటరు ట్రాక్‌కు, రెండు వైపులా 2,000 నాయిస్ బారియర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బుల్లెట్ రైలు సాధారణంగా అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో దాని నుంచి భారీ ఎత్తున సౌండ్ వెలువడుతుంది. దీని వలన పరిసర ప్రాంతాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సౌండ్‌ను తగ్గించడానికి ఈ అడ్డంకులను అమర్చుతున్నారు.

ఈ రైలు మార్గంలో అవసరమయ్యే నాయిస్ బారియర్‌ల కోసం వీటి తయారీకి సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో మూడు ప్రీకాస్ట్ ఫ్యాక్టరీలను స్థాపించారు. ఇవి ప్రాజెక్ట్‌కు అవసరమయ్యే బారియర్‌ల‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి నాయిస్ బారియర్‌‌ 2 మీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పుతో కూడిన కాంక్రీట్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. దీని బరువు 830-840 కిలోగ్రాములు. ఇవి ట్రాక్‌లపై చక్రాల ద్వారా ఉత్పన్నమయ్యే సౌండ్‌ను తగ్గిండంలో ప్రధానంగా దృష్టి సారిస్తాయి. ముఖ్యంగా నివాసిత, పట్టణాల గుండా వెళ్తున్న ట్రాక్‌లో 3 మీటర్ల ఎత్తులో వీటిని అమర్చుతున్నారు. ఇదిలా ఉంటే ముంబై నుంచి అహ్మదాబాద్‌ను కలిపే బుల్లెట్ రైలు 2026లో పాక్షికంగా అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి గతంలో పేర్కొన్నారు.


Similar News