Amit Shah on Delhi drug bust: ఢిల్లీ డ్రగ్స్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రమేయం..!

ఢిల్లీలో డ్రగ్స్ కేసు గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.

Update: 2024-10-04 10:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో డ్రగ్స్ కేసు గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత ప్రమేయం ఉండటం దారుణమని అన్నారు. ‘‘ఓపక్క ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ కోసం మోడీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఉత్తర భారత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌లో కాంగ్రెస్ నేత ప్రమేయం ఉండటం సిగ్గుచేటు. ప్రమాదకరం. కాంగ్రెస్ పాలనలో పంజాబ్‌, హర్యానా, ఉత్తర భారతంలోని యువత డ్రగ్స్ వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. యువతను క్రీడలు, ఆవిష్కరణలు, విద్యవైపు మోడీ ప్రోత్సహిస్తూంటే.. వారిని కాంగ్రెస్ మాదకద్రవ్యాలకు బానిస చేయాలనుకుంటోంది. డ్రగ్‌ డీలర్ల రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ఆ నెట్‌వర్క్‌ ఎక్కడున్నా మోడీ ప్రభుత్వం పెకిలించి వేస్తుంది’’ అని అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

కాంగ్రెస్ ఏమందంటే?

మరోపక్క కాంగ్రెస్ మాత్రం అమిత్ షా వ్యాఖ్యలను ఖండించింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదని హస్తం పార్టీ పేర్కొంది. అతడ్ని రెండేళ్ల క్రితమే పార్టీ నుంచి బహిష్కరించామని బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇకపోతే, ఢిల్లీలో భారీగా కొకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ కేసులో తుషార్ గోయల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు వెనుక అంతర్జాతీయ ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఈ స్మగ్లింగ్ వెనుక దుబాయ్‌లో ఉంటున్న భారత పౌరుడు వీరేంద్ర బసొయాను దీనికి మాస్టర్‌మైండ్‌గా గుర్తించారు. ప్రధాన నిందితుడు తుషార్ గోయల్ తో వీరేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు.


Similar News