Congress: ‘మహా’ ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయ్.. ఈసీకి కాంగ్రెస్ లేఖ

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-11-29 13:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఈవీఎం(EVM)లను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల్లో వ్యత్యాసాలున్నాయని వాటిపై విచారించి సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ లేఖ రాసింది. 12 పేజీలతో కూడిన ఈ లేఖలో ఓటర్ డేటాపై మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఖురేషీ లేవనెత్తిన సందేహాలు సహా పలు ప్రశ్నలను సంధించింది. ‘ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా 47వేల మంది ఓటర్లను చేర్చడం పలు అనుమానాలకు దారి తీస్తోందని తెలిపింది. సుమారు 50,000 మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 47 స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. తుల్జాపూర్ సీటులో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని, అక్రమ ఓట్లు వేయడానికి వివిధ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులను సృష్టించారని ఆరోపించింది.

పోలింగ్ డేటాలో తేడా

పోలింగ్ డేటాలనూ భారీగా తేడాలున్నాయని కాంగ్రెస్ తెలిపింది. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ 58.22 శాతం ఉంది. రాత్రి 11:30 గంటలకు 65.02శాతంగా నమోదైంది. మరుసటి రోజుకి 66.05శాతానికి ఎలా పెరిగిందని ప్రశ్నించింది. పోలింగ్ ముగిసిన గంటలోనే 70లక్షలకు పైగా ఓట్లు పోలవడం నమ్మశక్యంగా లేదని ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ అలా జరగలేదని తెలిపింది. పోలింగ్ చివరి గంటలో ఒక వ్యక్తి ఓటు వేయడానికి రెండు నిమిషాల సమయం తీసుకున్నా..76 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని భావించి, ఎన్నికల కమిషన్ తుది డేటాను రాత్రి 11.30 గంటలకు బయటకు తీసుకురావడం అసాధ్యమని పేర్కొంది. ఈ తేడాలపై విచారించి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Tags:    

Similar News