నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రూ. 751 కోట్ల ఆస్తుల స్వాధీనం

ఈ కేసుకు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై పీఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది.

Update: 2024-04-11 17:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ అసోసియేటెడ్ జర్నల్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.91 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్(పీఎంఎల్ఏ) అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబై, లక్నో, ఇంకా ఇతర ప్రదేశాలలోని భూములు, భవనాల వంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చిన అనంతరం ఈ ఆస్తులను జప్తు చేయవచ్చు. 2014 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించింది. యంగ్ ఇండియాలో సోనియా, రాహుల్‌లకు 38 శాతం చొప్పున మెజారిటీ వాటాలున్నాయి.1938లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రికలో ఈక్విటీ లావాదేవీ సమయంలో రూ. 2 వేల కోట్లకు పైగా ఆస్తుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2008లో కాంగ్రెస్ నుంచి రూ. 90 కోట్ల రుణాలను పునరుద్ధరించడంలో వైఫల్యం కారణంగా పత్రిక మూతపడింది. 

Tags:    

Similar News