కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది: బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ పార్టీని వీడడంపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-29 06:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ పార్టీని వీడడంపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దశా దిశా రెండూ లేకుండా పోయాయని విమర్శించారు. ఆ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నదని దాని వల్ల తమకు తామే నాశనం చేసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే మంచి వాళ్లంతా పార్టీని వీడుతున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశమంతా మోడీ జపమే కొనసాగుతుందని తెలిపారు. బీజేపీకి తుపానులా మద్దతు లభిస్తుందని కొనియాడారు.

రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ ప్రస్తుతం విదిశా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. కాగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ తాజాగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆప్ నేతలకు ఇష్టం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శివరాజ్ సింగ్ పై వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News