రాజవంశ రాజకీయాలపైనే కాంగ్రెస్ దృష్టి: ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ రాజవంశం, అవినీతి, బుజ్జగింపులకు మించి వేరే దేనిపైనా దృష్టి పెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రాజవంశం, అవినీతి, బుజ్జగింపులకు మించి వేరే దేనిపైనా దృష్టి పెట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. దేశ భవిష్యత్‌ను నిర్మించే ఒక్క ప్రణాళిక కూడా వారి దగ్గర లేదన్నారు. రాయ్ పూర్‌లో శనివారం నిర్వహించిన ‘వికసిత్ భారత్-వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో భాగంగా మోడీ మాట్లాడారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటుపైనే వారి దృష్టంతా ఉందని, కానీ దేశం ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలనే ఆలోచన మాత్రం వారి వద్ద లేకపోవడం బాధాకరమన్నారు. ఆ పార్టీకి దశ దిశ ఏం లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ శ్రేణులు వారి కుమారులు, కుమార్తెల భవిష్యత్ ను తీర్చి దిద్దడంలో బిజీగా ఉన్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, కొత్త బీజేపీ ప్రభుత్వం దానిని వేగవంతం చేసిందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పుడు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని చెప్పారు. పేదలు, యువత, మహిళల సాధికారతతోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నిర్మించొచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూ. 34,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.