‘స్పెషల్ సెషన్’ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి : జైరాం రమేష్
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తూ 1989లో తొలిసారిగా అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. ఆ బిల్లు అప్పట్లో లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో వీగిపోయిందన్నారు. అనంతరం 1993లో పీవీ నరసింహరావు హయాంలో ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారిందని తెలిపారు.
ఈమేరకు జైరాం రమేష్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2010 మార్చి 9న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించగా లోక్‌సభలో అడ్డంకులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదేళ్లుగా డిమాండ్ చేస్తోందన్నారు.