Congress : ఎన్నికల నియమావళి సవరణలపై కాంగ్రెస్ రిట్ పిటిషన్
ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నియమావళి 1961కి ఇటీవల చేసిన సవరణలను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇటీవల సీసీ టీవీ కెమెరా, వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను తనిఖీ చేయడంపై నిషేధం విధించింది. ఎన్నికల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఎన్నికల నియమావళిని సవరించింది. దీంతో ఎన్నికల రికార్డులు మినహా ఇతర పత్రాలు, డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉండనున్నాయి.
పోలింగ్ బూత్‌ల్లో సీసీ టీవీలు అమర్చడం వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతుందని ఈసీ అధికారులు వెల్లడించారు. అందుకే నిషేధం విధించినట్లు వెల్లడించారు. ఫుటేజీతో సహా ఎలక్ట్రానిక్ రికార్డులు అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని ఈసీ స్పష్టతనిచ్చింది. కానీ ఇతరులకు మాత్రం తనిఖీ చేసే అధికారం లేదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘాతమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. పారదర్శకతకు ఈసీ ఎందుకు జంకుతోందని ప్రశ్నించింది. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ ఏకపక్షంగా ప్రజలతో ఎలాంటీ సంప్రదింపులు లేకుండా మార్పులు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.