Congress aap: పొత్తు కుదరకపోతే అభ్యర్థులను ప్రకటిస్తాం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పొత్తుపై సందిగ్దత నెలకొంది.

Update: 2024-09-09 09:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పొత్తుపై సందిగ్దత నెలకొంది. రెండు పార్టీల మధ్య వారం రోజులుగా చర్చలు జరుగుతున్నా సీట్ల పంపకంపై క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆప్ పూర్తిగా సిద్ధమైందని, ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పొత్తుపై సోమవారం నిర్ణయం తీసుకోకుంటే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఆప్ క్యాండిడేట్స్‌ను బరిలోకి దింపుతామని వెల్లడించారు. పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఎంపికైన అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభిస్తారన్నారు.

అంతకుముందు హర్యానా ఆప్ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ సుశీల్ గుప్తా మాట్లాడుతూ.. పొత్తుపై ఇప్పటి వరకు హైకమాండ్ ఏమీ చెప్పలేదని తెలిపారు. ఈరోజు కూటమి ఏర్పాటు కాకపోతే మొత్తం 90 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను పోటీకి దింపుతామన్నారు. అతి త్వరగా సీట్ షేరింగ్ పై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా, హర్యానా అసెంబ్లీలోని 90 స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 12గా ఉంది. అయితే ఆప్ 5 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 3 సీట్లు కావాలని కాంగ్రెస్‌ను కోరాయి. ఆప్ సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ ఎస్పీ సీట్లపైనే సందేహం నెలకొన్నట్టు తెలుస్తోంది. 


Similar News