Congress: అసెంబ్లీ ఎన్నికలపై మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. కాగా.. బీజేపీకి రెబల్స్ బెంగ పట్టుకుంది. ఇలాంటి టైంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రమేశ్ చెన్నితల కాషాయపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-30 11:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. కాగా.. బీజేపీకి రెబల్స్ బెంగ పట్టుకుంది. ఇలాంటి టైంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రమేశ్ చెన్నితల కాషాయపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మహాయుతి పోటీ చేస్తున్నట్లుగా లేదని.. బీజేపీ నేతలే బరిలో ఉన్నట్లు కన్పిస్తోందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి పనైపోయిందని జోస్యం చెప్పారు. మహావికాస్‌ అఘాడీలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్‌ సమాన గౌరవం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అందుకే అందులో ఎలాంటి అలకలు, కొట్లాటలు లేవన్నారు. రెబల్స్ అందరూ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలని కాంగ్రెస్ నేత నసీం ఖాన్‌ను సమాజ్‌వాదీ పార్టీతో మాట్లాడాల్సిందిగా కోరామని తెలిపారు. నవంబర్ 4 నాటికి రెబెల్స్ నామినేషన్ల సమస్య తీరిపోతుందన్నారు. అయితే ‘మహాయుతి’లో శివసేన, ఎన్సీపీలకు దక్కాల్సిన సీట్లను కూడా బీజేపీ లాగేసుకుందని విమర్శించారు.

ఎంవీఏ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా..

మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవిధంగా కృషిచేస్తామని రమేశ్ చెన్నితాల తెలిపారు. ఎంవీఏ నేతలు క్రమశిక్షణతో పోరాడతారని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల నామినేషన్‌ గడువు ముగిసినప్పటికీ..అధికార మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి ఇంకా నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయలేదు. మరోవైపు శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్పీ) నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ (MVA) సైతం 11 స్థానాల్లో అధికారికంగా అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఇప్పటివరకు భాజపా 152స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. అజిత్‌ పవార్‌ వర్గం నుంచి 52 మంది.. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 80 మంది పేర్లను అధికారికంగా ప్రకటించాయి. దీంతో అధికార పక్షానికి సంబంధించి మొత్తంగా 284 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాగా.. మిగతా నాలుగు సీట్లపై సందిగ్ధత నెలకొంది. మహారాష్ట్రలో నవంబర్‌ 20న ఒకే దశలో పోలింగ్‌ జరగనుండగా.. నవంబర్‌ 23న ఫలితాలు రానున్నాయి.


Similar News