ప్రభుత్వ వెడ్డింగ్ కిట్‌లలో కండోమ్స్ పంచిన అధికారులు.. దెబ్బకు షాకైన కొత్త పెళ్లి జంటలు!
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్ సర్కార్ ప్రవేశపెట్టిన కన్యా వివాహ యోజన స్కీంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్ సర్కార్ ప్రవేశపెట్టిన కన్యా వివాహ యోజన స్కీంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో నిర్వహించిన సామూహిక వివాహల కార్యక్రమం సందర్భంగా కొత్త జంటలకు మేకప్ కిట్‌లు పంపిణీ చేశారు. ఈ బాక్కుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. సీఎం కన్యా వివాహం/నికా యోజన స్కీం కింద మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ.55,000 అందజేస్తోంది.
ఈ స్కీమ్‌లో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన 296 జంటలు సామూహిక వివాహ కార్యక్రమం ద్వారా ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా దంపతులకు పంపిణీ చేసిన మేకప్ కిట్‌లలో కండోమ్, గర్భనిరోధక మాత్రలు కనిపించడం విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ రాష్ట్ర ఆరోగ్యశాఖపై ఆరోపణలు చేశారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేసే బాధ్యత తమది కాదని ఇదంతా ఆరోగ్యశాఖ చూసుకుంటుందని వారి తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని ఆరోపించారు.
కాగా గత నెలలో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద జరిగిన సామూహిక వివాహ వేడుకలు సైతం వివాదాస్పదం అయ్యాయి. ఆ సందర్భంలో వధువులకు ప్రెగ్నెన్సీ టెస్టులు నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. కొన్ని జంటలు పెళ్లికి సిద్ధం కాగా వారికి నిర్వహించిన ప్రెగ్నెన్సీ టెస్టుల్లో నలుగురికి పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆ నలుగురిని ఈ స్కీమ్‌కు అనర్హులుగా ప్రకటించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈసారి ఏకంగా మేకప్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్ రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.