సుప్రీంకోర్టు జడ్జిగా వెంకటనారాయణ!

Update: 2023-07-05 17:12 GMT

న్యూఢిల్లీ: ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు(సీజే) జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి పదోన్నతులు పొందనున్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తుండగా, ఎస్వీ భట్టి కేరళ చీఫ్‌ జస్టిస్‌గా ఉన్నారు. వీరిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం బుధవారం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34 కాగా, ప్రస్తుతం 31 మంది మాత్రమే ఉన్నారు. జస్టిస్‌ కృష్ణ మురారి ఈ నెల 7న పదవీ విరమణ చేయనుండగా, ఖాళీల సంఖ్య 4కు చేరనుంది. ఈ క్రమంలోనే వీరి పేర్లను కొలీజియం సిఫారసు చేసింది.

ఈ సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే ఖాళీల సంఖ్య రెండుకు పడిపోనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ ఎస్వీ భట్టి.. 2013 ఏప్రిల్ 12న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2019లో కేరళకు బదిలీ అవ్వగా, గత నెల 1 నుంచి సీజేగా సేవలందిస్తున్నారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ అనంతరం 2022 ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాతినిధ్యం లేదని కొలీజియం తీర్మానం పేర్కొంది. ఇక, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 2011 అక్టోబర్ 17న ఆయన మాతృకోర్టు అయిన గువహతి హైకోర్టు జడ్జిగా నియామకమయ్యారు. 2022 జూన్ 28 నుంచి ఆయన తెలంగాణ సీజేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


Similar News