Uttar Pradesh CM : ఐక్యతే దేశానికి బలం. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్

బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-26 12:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాని కంటే గొప్ప ఏదీ లేదని, ప్రజలంతా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం బలపడుతుందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూశారని, ఆ తప్పు మన దేశంలో పునరావృతం కాకూడదని చెప్పారు. సోమవారం ఆగ్రాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతిపక్షం ప్రపంచ సమస్యలపై త్వరగా మాట్లాడుతున్నప్పటికీ హిందువులను హింసించడం, బంగ్లాదేశ్‌లో దేవాలయాల కూల్చివేతలపై మాత్రం మౌనంగా ఉంది. వారు పాలస్తీనా సమస్యను చూస్తారని, కానీ బంగ్లాదేశ్‌కు సంబంధించిన తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో కళ్లు మూసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలిగి దేశం విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి కంటే ఓటుబ్యాంకు గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. చిన్న చిన్న ప్రయోజనాల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న విభజన శక్తులను ఎదుర్కోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సమాజంలో చీలికను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అటువంటి వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Tags:    

Similar News