Cm pinarayi vijayan: హృదయ విదారక విపత్తు: వయనాడ్ ఘటనపై కేరళ సీఎం విజయన్
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), వైమానిక దళ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, రెస్య్యూ ఆపరేషన్‌కు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), వైమానిక దళ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, రెస్య్యూ ఆపరేషన్‌కు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు, శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు శాయ శక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం హృదయ విదారక విపత్తు అని తెలిపారు. రాష్ట్రం ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాల్లో వయనాడ్ ఘటన ఒకటన్నారు.
ప్రభావిత జిల్లాలో 321 మంది ఫైర్ ఫోర్స్‌ను మోహరించినట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలను మంగళవారం రాత్రి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 45 సహాయ శిబిరాలను ప్రారంభించామని, అందులో 3069 మందిని ఉంచామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 118 శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా కోజికోడ్ విమానాశ్రయంలో వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు నిలిచిపోయాయన్నారు.
విపత్తులో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలని కోరారు. మీడియా సమావేశం అనంతరం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయడం, తదుపరి చర్యలపై అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలతో సమన్వయం, ఇతర సౌకర్యాల ఏర్పాటు వంటి విరాలపై సమీక్షించారు. ఈ భేటీలో సీఎస్‌తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.