Cji chandrachud: ఇది కాఫీ షాప్ కాదు.. సుప్రీంకోర్టు: ఓ న్యాయవాదిపై సీజేఐ ఫైర్

సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తీరుపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-09-30 09:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తీరుపై సీజేఐ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో అనుచిత భాష మాట్లాడటం సరికాదని ఫైర్ అయ్యారు. మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. 2018 నాటి ఈ కేసులో గొగొయ్‌ను ప్రతివాదిగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టే సమయంలో సీజేఐ మాట్లాడుతూ.. ఇది ఆర్టికల్ 32కు సంబంధించిన కేసు అని అలాంటప్పుడు గొగొయ్‌ను ప్రతివాదిగా ఎలా చేరుస్తారని ప్రశ్నించారు? న్యాయమూర్తిపై అంతర్గత విచారణ కావాలని మీరు చెప్పలేరని తెలిపారు.

అనంతరం సీజేఐ ప్రశ్నకు న్యాయవాది బదులిస్తూ..‘యా యా’ మాజీ సీజేఐ రంజన్ క్యూరెటివ్ ఫైల్ చేయమని నన్ను అడిగారు అని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ ఇది కాఫీ షాప్ కాదని.. సుప్రీంకోర్టు అని చెప్పారు. భాష చాలా అసహ్యంగా ఉందని ఇటువంటి వాటిని కోర్టు అంగీకరించబోదని మండిపడ్డారు. అవును అవును కాకుండా కేవలం అవును అని మాత్రమే చెప్పాలని సూచించారు. మీరు వాడిన భాష నాకు కొంచెం ఎలర్జీగా ఉందన్నారు. వాదనలు విన్న సీజేఐ పిటిషన్ నుంచి జస్టిస్ గొగొయ్ పేరును తొలగించాలని పిటిషనర్‌కు సూచించారు. కాగా, గతంలోనూ పలువురు న్యాయవాదుల తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


Similar News