సోమవారం దాకా జైల్లోనే కేజ్రీవాల్.. ఆ రోజే అత్యవసర విచారణ ?
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తన అరెస్టు అక్రమమని, ఈడీ అరెస్టును రద్దు చేయాలంటూ కేజ్రీవాల్ వేసిన అత్యవసర పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆప్ చీఫ్ బుధవారం ఉదయం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎదుట హాజరై తన క్లయింట్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్ల వివరాలన్నీ అధికారిక మెయిల్‌కు పంపామని సీజేఐకు గుర్తు చేశారు. ‘‘తప్పుడు ఆధారాలను చూపించి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. చాలా ఆధారాలను ఆప్ చీఫ్‌కు కనీసం చూపించకుండానే ఆయనపై అభియోగాలను మోపారు’’ అని సీజేఐకు వివరించారు. ఒక సీఎం స్థాయి వ్యక్తిని అరెస్టు చేయబట్టే తాము తక్షణ విచారణ కోరుతున్నామని సింఘ్వీ తెలిపారు. అయితే వెంటనే విచారణ చేపట్టేందుకు సీజేఐ నో చెప్పారు. ‘నేను వెంటనే చూస్తాను.. పరిశీలిస్తాను’ అని ఆయన బదులిచ్చారు. మెయిల్‌కు అందిన డాక్యుమెంట్లన్నీ పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. కేజ్రీవాల్ అప్పీల్‌పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం..గురువారం ఈదుల్ ఫితర్ సందర్భంగా కోర్టు కార్యకలాపాలు జరగవు. శుక్రవారం స్థానిక సెలవుదినం, ఆపై వారం ముగుస్తుంది. ఈ పిటిషన్‌ను సోమవారం (ఏప్రిల్ 15) విచారణకు లిస్ట్ చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తెలిపారు. అంటే అప్పటి వరకు తిహార్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది.