దిశ, నేషనల్ బ్యూరో: డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్ అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రేమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఝాజ్ర ప్రాంతంలో జరిగిన ఘటనతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్, ఇతర పోలీసులు, ఫైర్ విభాగం అధికారులు ఆ ప్రాంతంలోని స్థానికులందరినీ ఖాళీ చేయించారు. మంగళవారం ఉదయం ఝాజ్ర ప్రాంతంలోని ఖాళీ ప్లాట్‌లో క్లోరిన్ గ్యాస్ సిలిండర్లను డంప్ చేశారు. వాటిలో కొన్ని లీక్ అవడంతో చుట్టుపక్కల నివశిస్తున్న స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెస్క్యూ టీమ్ బృందాలు సేఫ్టీ గేర్, మాస్క్‌లతో గ్యాస్ లీకేజీని నిలువరించి, లోపాలున్న సిలిండర్లను సరిచేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.