India-China: ట్రైజంక్షన్ డోక్లాంపై డ్రాగన్ పట్టు.. శాటిలైట్ చిత్రాల ద్వారా బయటపడ్డ చైనా కుతంత్రాలు

భారత్‌- భూటాన్‌- చైనా ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం (Doklam)పై సంచలనాలు బయటకొస్తున్నాయి. ట్రైజంక్షన్ పై డ్రాగన్ పట్టు సాధించింది.

Update: 2024-12-18 07:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌- భూటాన్‌- చైనా ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం (Doklam)పై సంచలనాలు బయటకొస్తున్నాయి. ట్రైజంక్షన్ పై డ్రాగన్ పట్టు సాధించింది. భూటాన్‌కు చెందిన భూభాగంలో గత ఎనిమిదేళ్లుగా 22 గ్రామాలు, స్థావరాలను చైనా నిర్మించింది (China building villages). వాటిలో 2020 నుంచి డోక్లాం సమీపంలో 8 గ్రామాలు ఏర్పడ్డాయని శాటిలైట్ చిత్రాలతో తెలుస్తోంది. ఇకపోతే, చైనా నిర్మించిన 22 గ్రామాల్లో జివు అతి పెద్దది. అది భూటాన్‌కు చెందిన ప్రాంతంలో ఉంది. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా పట్టు సాధిస్తుండటంతో.. కీలకమైన సిలిగురి కారిడార్‌ (చికెన్స్‌ నెక్‌)కు ముప్పుగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈశాన్య భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళ్తాయి. దీంతోపాటు కీలక పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌కు ఇదే మార్గం. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉంది. నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది.

చైనా వ్యవహారాలపై ఆందోళన

ఈ పరిణామాలపై భారత్‌లోని చైనా వ్యవహారాల భద్రతాబలగాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని భయపడుతున్నాయి. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని భద్రతా దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్‌ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం (Doklam in Bhutan) ప్రాంతం తమదేనంటూ చైనా వాదిస్తూ వస్తోంది. ఈ విషయమై 2017లో భారత్‌-చైనా (India-China)ల మధ్య 72 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దౌత్యంతో ఆ సమస్య పరిష్కారమైనా.. ఇప్పుడు వస్తున్న శాటిలైట్ చిత్రాలతో డ్రాగన్ కుతంత్రాలు వెలుగులోకి వస్తున్నాయి.


Similar News