Chennai Doctor: రూ.5 కోట్ల అప్పులు.. కుటుంబం ఆత్మహత్య
అన్యోన్య దాంపత్యాన్ని అప్పులు చిదిమేశాయి. రూ. 5 కోట్లకు చేరడంతో చెల్లించలేని పరిస్థితులలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: అన్యోన్య దాంపత్యాన్ని అప్పులు చిదిమేశాయి. రూ. 5 కోట్లకు చేరడంతో చెల్లించలేని పరిస్థితులలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చెన్నై తిరుమంగళంలో గురువారం ఉదయం ఈఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. చెన్నైలో అన్నానగర్, తిరుమంగళం పరిధిలోని 17వ క్రాస్ స్ట్రీట్‌లోని అపార్ట్ మెంట్ లో నలుగురు కుటుంబసభ్యులు ఉరేసుకుని చనిపోయారు. తిరుమంగళంలో డాక్టర్ బాలమురుగన్ (52) కుటుంబం నివాసిస్తూ వచ్చింది. ఆయన భార్య సుమతి (47) హైకోర్టులో న్యాయవాది. ఈ దంపతులకు జశ్వంత్‌కుమార్ (19), లింగేశ్‌కుమార్(17) కుమారులు. గురువారం ఉదయం బాలమురుగన్ డ్రైవర్ విజయ్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకు డాక్టర్ తెరవక పోవడంతో పక్కన ఉన్న ప్లాట్‌ల వారి సహకారంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, పోలీసులు ఆ ప్లాట్‌కు చేరుకుని తలుపు పగల కొట్టి వెళ్లి చూడగా ఓ గదిలో ఒకే ఫ్యాన్‌కు బాలమురుగన్ భార్య సుమతి, చిన్న కుమారుడు లింగేశ్వర్ ఉరివేసుకుని విగతజీవులుగా కన్పించారు. మరో గదిలో వేర్వేరు ఫ్యాన్‌లకు బాల మురుగన్, పెద్దకుమారుడు జశ్వంత్‌కుమార్ మృతదేహాలుగా వేలాడుతుండటంతో కలకలం రేగింది. డెడ్ బాడీలను పోస్టుమార్టంకు తరలించినపోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు.
స్కాన్ సెంటర్ల విస్తరణ కోసం అప్పులు
బాల మురుగన్‌కు అన్నానగర్‌లో రెండు, రెడ్ హిల్స్‌లో ఒకటి సహా పలు చోట్ల స్కాన్ సెంటర్లు ఉన్నాయి. అయితే, స్కాన్ సెంటర్ల విస్తరణ కోసం రూ. 5 కోట్ల వరకు అప్పులు చేసినట్టు విచారణలో తేలింది. నెలకు రూ.5 లక్షల వరకు ఈఎంఐలు కడుతుండటం, మరికొందరికి వడ్డీలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ చెల్లించ లేని పరిస్థితులలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగినట్టు గుర్తించారు. అప్పులు కట్ట లేని పరిస్థితులలో తీవ్ర మనోవేదనతో ఉన్న డాక్టర్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అన్న పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భార్య, పెద్ద కుమారుడు, చిన్నకుమారుడ్న హత్య చేసి చివరకు డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.