Chandrayaan-3: నాలుగో కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్‌-3..

చంద్రుడిపై రీసెర్చ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా పయనిస్తోంది.

Update: 2023-07-20 15:20 GMT

బెంగళూరు : చంద్రుడిపై రీసెర్చ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి దిశగా పయనిస్తోంది. గురువారం స్పేస్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ లోని పేలోడ్ ను మండించి నాలుగోసారి విజయవంతంగా శాటిలైట్ కక్ష్య (ఎర్త్‌ బౌండ్‌ ఆర్బిట్‌ మాన్యువర్‌)ను పెంచింది. ఇప్పటివరకు మూడుసార్లు ఈవిధంగా చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్యను పెంచారు. తదుపరి కక్ష్య మార్పిడి ప్రక్రియ జులై 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఉంటుందని ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం నుంచి చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్నారు. చంద్రయాన్-3 గమనం సజావుగా సాగుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో ఉందన్నారు.

చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుందని.. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశముందని ఇస్రో వర్గాలు అంటున్నాయి. చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా ఈ నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ .. ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఇస్రో క్రమక్రమంగా ఇంజిన్‌ను మండించి దాన్ని చంద్రుడి దక్షిణ ధృవపు కక్ష్య దిశగా పంపుతోంది. "గురువారం ఇంటర్నేషనల్ మూన్ డే సందర్భంగా చంద్రయాన్-3ని చంద్రుడికి మరింత చేరువ చేస్తూ... భారత్ ఈ వేడుక చేసుకుంటోంది" అని ఇస్రో ట్వీట్ చేసింది.


Similar News