సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కేంద్రం ప్రశంసలు

ఆర్థిక సంస్కరణలు కంపెనీల చట్టం సహా అనేక చట్టాలను సరళీకృతం చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు.

Update: 2024-04-17 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లను ప్రశంసించింది. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం.. 1991లో ఆర్థిక సరళీకరణను ప్రారంభించి, భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లను అభినందించింది. వారి నిర్ణయాల కారణంగా దేశంలో లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికారని పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి పీవీ, మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు కంపెనీల చట్టం సహా అనేక చట్టాలను సరళీకృతం చేశాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలియజేశారు. వారి నిర్ణయంతో ఆ తర్వాత మూడు దశాబ్దాల్లో వచ్చిన ప్రభుత్వాలు పరిశ్రమల చట్టం, 1951ని సవరించాల్సిన అవసరాన్ని చూడలేదని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల ప్రభావం ఉన్నప్పటికీ పరిశ్రమల చట్టం వల్ల వివిధ పరిశ్రమలపై కేంద్రం గణనీయమైన నియంత్రణను కొనసాగించేందుకు వీలు కల్పించినట్టు మెహతా స్పష్టం చేశారు. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి లాంటి అత్యవసర పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమలను నియంత్రించే అధికారాన్ని కేంద్రం కలిగి ఉంది. ఇండస్ట్రియల్ ఆల్కాహాల్‌ను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేకుంటే మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్‌ల ఉత్పత్తిలో రాజీపడాల్సి వచ్చేదని మెహతా వెల్లడించారు.  

Tags:    

Similar News