ఫ్యామిలీ పెన్షన్ : మహిళా ఉద్యోగులు కొడుకు, కుమార్తెనూ నామినేట్ చేయొచ్చు
దిశ, నేషనల్ బ్యూరో : ఇప్పటిదాకా మహిళా ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులు ఫ్యామిలీ పెన్షన్ కోసం వారి భర్త పేరును మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇప్పటిదాకా మహిళా ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులు ఫ్యామిలీ పెన్షన్ కోసం వారి భర్త పేరును మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇందుకోసం మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. విడాకులు, గృహ హింస, వరకట్న వేధింపుల వంటి కారణాల వల్ల కొంతమంది మహిళలు భర్త పేరును ఫ్యామిలీ పెన్షన్ కోసం నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపించరు. ఇలాంటి వారంతా ఇకపై తమ కొడుకు లేదా కూతురి పేరును నామినేట్ చేసుకోవచ్చు. ఈమేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్- 2021లో సవరణను ప్రవేశపెట్టామని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈవిధంగా నామినేషన్‌లో మార్పులు చేయదల్చిన మహిళా ప్రభుత్వోద్యోగులు లేదా పింఛనుదారులు తప్పనిసరిగా సంబంధిత కార్యాలయంలో రాతపూర్వక అభ్యర్థనను అందజేయాలి. తమ భర్త కాకుండా పిల్లల పేర్లనే పెన్షన్ కోసం నామినేట్ చేయాలని కోరాలి.