పేపర్ లీక్ నిరోధక చట్టం మార్గదర్శకాలు విడుదల
దిశ, నేషనల్ బ్యూరో : పేపర్ లీక్ నిరోధక చట్టం-2024 కింద జూన్ 23న నోటిఫై చేసిన మార్గదర్శకాల వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : పేపర్ లీక్ నిరోధక చట్టం-2024 కింద జూన్ 23న నోటిఫై చేసిన మార్గదర్శకాల వివరాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ చట్టాన్ని న్యాయ పరిభాషలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ మార్గాల నివారణ) యాక్ట్ - 2024’ అని పిలుస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ, జాతీయ స్థాయి పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఈ చట్టం స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన నిబంధనలు, ప్రమాణాలు, మార్గదర్శకాలను సిద్ధం చేసి పరీక్షల నిర్వాహక సంస్థలకు అందించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తరఫున నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ)కు అందిస్తున్నామనే నిబంధనను పేపర్ లీక్ నిరోధక చట్టంలో ప్రస్తావించారు.
పరీక్షల నిర్వాహక సంస్థలతో సంప్రదించి.. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి అవసరమైన నిబంధనలు, ప్రమాణాలు, మార్గదర్శకాలను ఎన్ఆర్ఏ సిద్ధం చేస్తుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారిని, రిటైర్డ్ ఉద్యోగుల సేవలను జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించిన నిబంధన కూడా ఈ యాక్ట్‌లో ఉంది. జాతీయ స్థాయి పరీక్షల విజయవంతానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చని పేపర్ లీకుల నిరోధక చట్టం చెబుతోంది. ఈ కమిటీకి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని పేర్కొంది. ఈ కమిటీలో సీనియర్ అధికారి, పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీ నుంచి నామినేటెడ్ అధికారి కూడా సభ్యులుగా ఉండొచ్చు.యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు, ఎన్‌టీఏ నిర్వహించే పబ్లిక్ పరీక్షలలో అక్రమ మార్గాలను నిరోధించడమే ఈ చట్టం లక్ష్యం.