రెజ్లర్ల ఆందోళనను సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నాం: అనురాగ్ ఠాకూర్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు
ముంబై: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ రెజ్లర్లు చేస్తున్న నిరసనలపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తోందని వెల్లడించారు.
గురువారం ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిజ్ భూషణ్ పై తమ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలన్న రెజ్లర్ల డిమాండును కేంద్రం అంగీకరించిందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. రెజ్లర్ల డిమాండు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కానీ ఆ కమిటీ పని చేయకుండా రెజ్లర్లు అడ్డుపడుతున్నారని ఠాకూర్ చెప్పారు.
మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచించిందని ఆయన తెలిపారు. క్రీడలను కించపరచడం లేదా క్రీడాకారుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దని రెజ్లర్లను ఆయన కోరారు. ఆరోపణలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రెజ్లర్లు సంయమనం పాటించాలని, సుప్రీంకోర్టుపై విశ్వాసం ఉంచాలని సూచించారు.
Also Read..