6 యూట్యూబ్ చానళ్లపై నిషేధం

ఖలిస్తాన్ అనుకూల ప్రచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ చానెళ్లపై నిషేధపు వేటు వేసినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు.

Update: 2023-03-10 15:59 GMT

న్యూఢిల్లీ: ఖలిస్తాన్ అనుకూల ప్రచారం చేస్తున్న ఆరు యూట్యూబ్ చానెళ్లపై నిషేధపు వేటు వేసినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు. విదేశాల నుంచి నిర్వహిస్తున్న ఆరు నుంచి ఎనిమిది చానళ్లను గత పది రోజుల్లో నిషేధించినట్టు ఆయన తెలిపారు. పంజాబ్ భాషలో కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఈ చానెళ్లు సరిహద్దు రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.

తీవ్రవాద ప్రబోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు తమ సహ నాయకులలో ఒకరిని విడుదల చేయాలని కోరుతూ కత్తులు, తుపాకీలతో అజ్నాలాలోని పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమృత్‌పాల్ గతేడాది ‘వారిస్ పంజాబ్ డి’ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. దీనిని నటుడు, కార్యకర్త కీర్తిశేషులు దీప్ సిద్ధు స్థాపించారు.

ఖలిస్తాన్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరిందని.. 48 గంటల్లో చర్యలు తీసుకున్నారని మరో సీనియర్ అధికారి చెప్పారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను గుర్తించి బ్లాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథమ్‌లను ఉపయోగించాలని యూట్యూబ్ నిర్వాహకులను ప్రభుత్వం కోరినట్టు ఆ అధికారి చెప్పారు.

Tags:    

Similar News