CBI : ఎనిమిది మంది డాక్టర్లకు సీబీఐ సమన్లు.. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక పరిణామం

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.

Update: 2024-08-15 19:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే మొత్తం 8 మంది డాక్టర్లకు సీబీఐ సమన్లు ఇచ్చింది. విచారణ కోసం అందుబాటులో ఉండాలని వారికి నిర్దేశించింది. సమన్లు పొందిన డాక్టర్ల జాబితాలో.. జూనియర్ వైద్యురాలిపై దురాగతం చోటుచేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ మెడికల్ సూపరింటెండెంట్ సంజయ్ వశిష్ట్, చెస్ట్ విభాగాధిపతి అరుణవ దత్త చౌదరి ఉన్నారు. వీరితో పాటు జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీకి పోస్టుమార్టం నిర్వహించిన ముగ్గురు ఫోరెన్సిక్ డాక్టర్లు రీనా దాస్, మోలీ బెనర్జీ, అపూర్వ బిశ్వాస్‌లు కూడా సమన్లు అందుకున్నారు. ఈ ఐదుగురు డాక్టర్లను సీబీఐ గురువారం రోజు దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించింది. ఇక విచారణకు హాజరుకావాలంటూ సదరు మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు ట్రైనీ డాక్టర్లకు కూడా సీబీఐ సమన్లు ఇచ్చింది. ఆర్‌జీ కర్ కాలేజీ ప్రస్తుత ప్రిన్సిపల్ సుర్హితా పాల్‌ను కాలేజీలోనే కొన్ని గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

అనంతరం ఆమెను స్థానిక సీబీఐ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. అంతకుముందు గురువారం ఉదయం జూనియర్ వైద్యురాలి ఇంటికి సీబీఐ టీమ్ వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు అందించిన వివరాలను, అనుమానితుల సమాచారాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం సాయంత్రం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సెమినార్ హాల్‌లోని క్రైమ్ సీన్‌ను సీబీఐ టీమ్ నిశితంగా పరిశీలించి క్లూస్‌ను సేకరించింది. ఆగస్టు 8న రాత్రి ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన ఇంటర్న్ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని సీబీఐ ఈసందర్భంగా ప్రశ్నించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. చనిపోయిన జూనియర్ వైద్యురాలి ముగ్గురు బ్యాచ్‌మేట్లను సైతం సీబీఐ ప్రశ్నించింది.

Tags:    

Similar News