మాజీ గవర్నర్ ఇంట్లో సీబీఐ సోదాలు: అవినీతి ఆరోపణల కేసులో చర్యలు

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం సోదాలు చేపట్టింది. అంతేగాక సత్యపాల్‌కు చెందిన ఢిల్లీలోని సుమారు

Update: 2024-02-22 07:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) గురువారం సోదాలు చేపట్టింది. అంతేగాక సత్యపాల్‌కు చెందిన ఢిల్లీలోని సుమారు 30 ప్రాంతాల్లో దాడులు చేశారు. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ సోదాలు నిర్వహించారు. 100 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న టైంలో 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సివిల్ వర్క్‌లకు సంబంధించిన రెండు ఫైళ్లను క్లియర్ చేసేందుకు రూ.300 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. దీంతో సత్యపాల్‌తో సహా మరో ఐదుగురిపై 2022 ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగానే 2022 జూలైలో దేశ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. జనవరిలోనూ ఐదుగురి ఇళ్లపై తనిఖీలు చేపట్టింది.

దాడులకు భయపడను: సత్యపాల్ మాలిక్

సీబీఐ సోదాలపై సత్యపాల్ మాలిక్ స్పందించారు. ‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ, నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా సన్నిహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ సోదాలకు భయపడే ప్రసక్తే లేదు. ముమ్మాటికీ నేను రైతుల పక్షాన నిలబడతాను. ఎందుకంటే నేను రైతు బిడ్డను. ఈ చర్యలు నన్ను ఏ మాత్రం అడ్డుకోలేవు’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా, 2018 ఆగష్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్య జమ్మూ కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ బాధ్యతలు నిర్వహించారు. ఆ టైంలోనే అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News