Budget 2024: అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా- నిర్మలా సీతారామన్

ప్రతిపక్షాల నిరసనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(FM Nirmala Sitharaman) రాజ్యసభలో స్పందించారు.

Update: 2024-07-24 06:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల నిరసనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (FM Nirmala Sitharaman) రాజ్యసభలో స్పందించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని.. బడ్జెట్ లో అన్నిరాష్ట్రాలకు కేటాయింపులు ఉన్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేం కదా అని అన్నారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత రాజ్యసభలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. “బడ్జెట్ గురించి ప్రతిపక్షం, ప్రత్యేకించి సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Congress President) తన అభిప్రాయాన్ని చెప్పడానికి లేచి నిలబడడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కోసం.. కనీసం ప్రతిపక్షం అయినా నేను ప్రతిస్పందించేది వినడానికి ఇక్కడే ఉండేది. నేను చాలా రాష్ట్రాల పేర్లు చెప్పలేదని.. కేవలం రెండు రాష్ట్రాల గురించి మాట్లాడానని ఖర్గే (Kharge) ఎద్దేవా చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది. వారు చాలా భిన్నమైన బడ్జెట్‌లు సమర్పించారు. ప్రతి బడ్జెట్‌లో దేశంలోని ప్రతి రాష్ట్రం పేరు చెప్పే అవకాశం మీకు లభించదని స్పష్టంగా తెలుసు ”అని చురకలు అంటించారు.

కాంగ్రెస్ పై విమర్శలు

ఎన్డీయేతర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు ఏమీ ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించేందుకే ప్రతిపక్షాలు ఇలా ప్రవర్తిస్తున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ ప్రసంగంలో వారు అన్ని రాష్ట్రాల పేర్లు చదివారా అని ప్రశ్నించారు. అలా చదివినట్లు నిరూపించాలని.. కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. ఇది హేయమైన ఆరోపణ అని మండిపడ్డారు. ప్రసంగం ఒక నిర్దిష్ట రాష్ట్రాన్ని పేర్కొనకపోతే.. ఆ రాష్ట్రానికి ప్రభుత్వ పథకాలు అందవని అర్థం కాదు కదా అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. మహారాష్ట్రలోని వధావన్‌లో అతి పెద్ద ఓడరేవును ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. తాను బడ్జెట్ ప్రసంగంలో మహారాష్ట్ర పేరు చెప్పనుందుకు ఆ రాష్ట్రాన్ని విస్మరించినట్లా? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు రూ.76 వేల కోట్లు ప్రకటించారని తెలిపారు.


Similar News