Fire Crackers : బాణాసంచా విక్రయాలకు అనుమతించేది లేదు : హైకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధానిలో బాణాసంచా విక్రయాలకు అనుమతించే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : దేశ రాజధానిలో బాణాసంచా విక్రయాలకు అనుమతించే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. హస్తినలో బాణాసంచా నిల్వ, విక్రయాల కోసం శాశ్వత లైసెన్సులు కలిగిన వ్యాపారులంతా కలిసి ‘ఢిల్లీ ఫైర్ వర్క్స్ షాప్ కీపర్స్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారిస్తూ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. బాణాసంచాను తాము విక్రయించనప్పటికీ.. పాత స్టాక్‌ను కలిగి ఉన్నామనే ఏకైక కారణంతో అధికారుల వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోందని కోర్టుకు సదరు అసోసియేషన్ తెలిపింది.
‘‘బాణాసంచా నిల్వ చేసిన గోదాంలను అధికారులతో సీల్ చేయిస్తాం. వాటి నుంచి బయటికి స్టాక్ వెళ్లకుండా నిలువరిస్తాం. గోదాంల సీలింగ్ ప్రక్రియలో ఢిల్లీ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలి. బాణాసంచా అమ్మకాలకు అనుమతించే ప్రసక్తి లేనే లేదు’’ అని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ నారులా పేర్కొన్నారు. ఎవరైనా వ్యాపారులు బాణాసంచాను విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై బ్యాన్ విధిస్తూ ఆప్ ప్రభుత్వం సెప్టెంబరు 14న ఆదేశాలు జారీ చేసింది.