Justin Trudeau: ఖలిస్తానీలకు కెనడా పీఎం ట్రూడో ప్రోత్సాహం: కెప్టెన్ అమరీందర్ సింగ్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తానీలను ప్రోత్సహిస్తున్నాడని, వారి దుష్ప్రచారానికి మద్దతు ఇస్తున్నాడని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ఖలిస్తానీలను ప్రోత్సహిస్తున్నాడని, వారి దుష్ప్రచారానికి మద్దతు ఇస్తున్నాడని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(capt amarinder singh) ఆరోపించారు. భారత్, కెనడా సంబంధాలు దిగజారిపోవడానికి ఆయనే కారణమన్నారు. కెనడా పీఎం జస్టిన్ ట్రూడోకు ఎన్నికల్లో సిక్కుల ఓట్లు కావాలని, అందుకోసం దేనికైనా ఆయన సిద్ధపడుతాడని, గతంలోనూ ఆయన ఇలా చేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఖలిస్తానీ(Khalistan)లను ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపించారు. కెనడా జనరల్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. అందులో సిక్కుల ఓట్లు కొల్లగొట్టడానికి పీఎం జస్టిన్ ట్రూడో ఇలా ఖలిస్తానీలకు వంతపాడుతున్నారని సింగ్ ఆరోపణలు చేశారు. ‘నేను అధికారంలో ఉన్నప్పుడు కెనడా రక్షణ మంత్రి భారత పర్యటన చేశాడు. నన్ను కలవడానికి ప్రయత్నిస్తే నిరాకరించాను’ అని వివరించారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత దౌత్య అధికారులు, సిబ్బందిని విచారిస్తామని కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉభయ దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత ప్రభుత్వం దౌత్య అధికారులను వెనక్కి రప్పించుకుంది.