సందేశ్‌ఖాలీ అత్యాచారం, భూకబ్జాలపై సీబీఐ విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశం

ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-04-10 10:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీలోని దోపిడీ, భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 10న ఆదేశాలు జారీ చేసింది. మాజీ టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ నివాసంలో జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి చేయగా దీనిని కూడా విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

గతంలో సందేశ్‌ఖాలీకి చెందిన మహిళలు షాజహాన్, అతని సహాయకులు దోపిడీ, లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రొయ్యల దిగుమతి, ఎగుమతి వ్యాపారంలో అనేక అక్రమ ఆర్థిక లావాదేవీలను షాజహాన్ చేసినట్లుగా ఈడీ గుర్తించగా, ఆయన ఇంట్లో సోదాలు జరపడానికి ఈడీ అధికారులు వెళ్లగా, అక్కడ షాజహాన్ అనుచరులు వారి కార్లను ధ్వంసం చేసి, అధికారులపై దాడి చేశారు. ఆ తర్వాత షాజహాన్ పరారీలో ఉండగా, ఫిబ్రవరి 29 న పశ్చిమ బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు. ఈడీ అధికారులపై దాడి కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, సందేశ్‌ఖాలీలోని సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని పేర్కొంటూ దోపిడీ, భూకబ్జా, లైంగిక ఆరోపణలను కూడా సీబీఐ విచారణ చేస్తుందని కలకత్తా హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.


Similar News