ప్రధాని మోడీపై అదానీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపార ఎదుగుదలకు ఏ రాజకీయ పార్టీ, నాయకుడు కారణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అదానీ వంటి వ్యాపారవేత్తలకు మోడీ మేలు చేస్తున్నారని దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కోడై కూస్తున్న వేళ అదానీ స్పందించారు. ఓ ప్రైవేట్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ మాట్లాడారు. తన వ్యాపారానికి మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.3 దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలోనే అదానీ గ్రూప్ మొదలైందని గుర్తు చేశారు. తాను, మోడీ ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లం కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అతే తప్ప అందులో ఎలాంటి నిజం లేదని అదానీ స్పష్టం చేశారు. తన వ్యాపార విస్తరణకు ఏ ఒక్క వ్యక్తి కారణం కాదని, మూడు దశాబ్దాలుగా పలు ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు తీసుకొచ్చిన సంస్కరణలు కారణమని తేల్చి చెప్పారు.
రాజీవ్ గాంధీ హయాంలోనే నా వ్యాపారం మొదలైంది
రాజీవ్ గాంధీ హయాంలోనే తన వ్యాపారం మొదలైందని అదానీ తెలిపారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఎగ్జిమ్ (ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్) పాలసీయే తన వ్యాపార అభివృద్ధికి కారణమని అన్నారు. ఇక తన వ్యాపార విస్తరణకు పీవీ నరసింహ్మారావు, మన్మోహన్ సింగ్ జోడీ రెండో కారణం అని తెలిపారు. వాళ్లు తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు తన వ్యాపారానికి బాగా సాయపడ్డాయని చెప్పారు. ఇక మూడవ కారణం.. 1995లో గుజరాత్ కు సీఎంగా ఉన్న కేశుబాయి పటేల్ అని అన్నారు. గుజరాత్ లోని కోస్టల్ డెవలప్ మెంట్ లో భాగంగా తాను నిర్మించిన ముంద్రా పోర్ట్ తన ఆర్ధికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. ఇక 4వ కారణం నరేంద్ర మోడీ అని అదానీ అన్నారు.2001లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చిన అనేక అభివృద్ధి పాలసీలు తనలాంటి వ్యాపారవేత్తలకు ఎంతో ఊతమిచ్చాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం పీఎంగా ఉన్న మోడీ నాయకత్వంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న దేశాభివృద్ధిలో తాను కూడా ఓ వ్యాపారవేత్తగా పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ఇక వ్యాపారంలో తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ధీరూబాయి అంబానీ అని గౌతమ్ అదానీ చెప్పారు.
Also Read...