మంగళసూత్రం మింగేసిన బర్రె.. ఎలా బయటకు తీశారో తెలుసా?
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఆదివారం రూ 1.5 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని బర్రె మింగేసింది. నానా తిప్పలు పడి వైద్యుల సమక్షంలో బర్రెకు శస్త్రచికిత్స చేయగా మంగళసూత్రం బయటపడింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఆదివారం రూ 1.5 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని బర్రె మింగేసింది. నానా తిప్పలు పడి వైద్యుల సమక్షంలో బర్రెకు శస్త్రచికిత్స చేయగా మంగళసూత్రం బయటపడింది. రైతు రాంహరి భార్య స్నానానికి వెళుతుండగా తన మంగళసూత్రాన్ని సోయాబీన్, వేరుశెనగ చిప్పలు ఉన్న ప్లేట్‌లో దాచిపెట్టింది. మంగళసూత్రం గురించి మర్చిపోయి, రైతు భార్య అనుకోకుండా అదే ప్లేట్‌ను బర్రె ముందు తినడానికి ఉంచి ఇంటి పనిలో నిమగ్నమైంది.
తర్వాత ఆమె మంగళసూత్రం గురించి వెతకగా ఆమె బర్రెకు తినడానికి ఇచ్చిన ఆహారంలో మంగళసూత్రాన్ని దాచిపెట్టినట్లు ఆమె గుర్తుకు తెచ్చుకుంది. బర్రె దగ్గరకు పరిగెత్తుకెళ్లి చూడగా బర్రె ప్లేట్ ఖాళీగా చేసింది. దీంతో ఆమె తన భర్తకు సమాచారం అందించింది. అతను స్థానిక వెటర్నరీ డాక్టర్‌ను పిలిచాడు. అనంతరం బర్రె కడుపుకు ఆపరేషన్ చేసి, ఆ తర్వాత బర్రె కడుపులోంచి బంగారు మంగళసూత్రాన్ని బయటకు తీయగా రైతు భార్య ఊపిరి పీల్చుకుంది. బర్రె కూడా సేఫ్‌గానే ఉన్నట్లు డాక్టర్ తెలిపాడు.