జేడీయూ యువనేత దారుణ హత్య: బిహార్‌లో ఉద్రిక్తత
లోక్ సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) యువనేత హత్యకు గురయ్యాడు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం నితీశ్ కుమార్‌కి చెందిన పార్టీ జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) యువనేత హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేడీయూ యువ నాయకుడు సౌరభ్ కుమార్ (33) బుధవారం అర్ధరాత్రి పాట్నాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే పర్సా బజార్ గ్రామం వద్ద బైకుపై వచ్చిన నలుగురు దుండగులు ఆయనపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. సౌరబ్ తలకు రెండు బుల్లెట్లు తాకాయి. మరో వ్యక్తి సౌరబ్ స్నేహితుడు మున్మున్‌పై కూడా కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాపాలైప వీరిద్దరినీ వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమించి సౌరబ్ మృతి చెందాడు. మున్మున్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న పాట్నా పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపింది. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. రాజకీయ కక్షతోనే హత్య చేశారా? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేడీయూ నేతలు రోడ్డును దిగ్భందించి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాట్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఘటనా స్థలంలో బలగాలను మోహరించారు.