Bombay HC: ప్రభుత్వాధికారులను వేధించే హక్కు ఎవరికీ లేదు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఒకే అంశంపై పదే పదే ఫిర్యాదులు చేసి ప్రభుత్వాధికారులను వేధించే హక్కు ఎవరికీ లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఒకే అంశంపై పదే పదే ఫిర్యాదులు చేసి ప్రభుత్వాధికారులను వేధించే హక్కు ఎవరికీ లేదని బాంబే హైకోర్టు (Bombay high court) స్పష్టం చేసింది. ఈ మేరకు నలుగురు వ్యక్తులపై ‘పర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటిస్తూ.. బృహత్ ముంబై కార్పొరేషన్ (BMC) జారీ చేసిన సర్య్కూలర్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరీ(Gadkaree), కమల్ ఖాటా(kamal kata)తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యే ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగానూ రక్షించాలని కోరడం లేదని, కానీ ఏ ప్రభుత్వోద్యోగి కూడా నిత్యం బెదిరింపులు, ఫిర్యాదుదారుల ఒత్తిడితో పని చేయకూడదని వ్యాఖ్యానించింది.
ముంబై నగరంలో రోడ్ల దుస్థితి, చెట్ల నరికివేతకు సంబంధించి నలుగురు వ్యక్తులు పదే పదే ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ వ్యక్తులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటిస్తూ 2021 డిసెంబర్‌లో బీఎంసీ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. వారి ఫిర్యాదు కేవలం అధికారులను వేధించేలా మాత్రమే ఉన్నాయని తెలిపింది. ఈ సర్క్యూలర్‌ను సవాల్ చేస్తూ సాగర్ దౌండే, నానాసాహెబ్ పాటిల్ అనే వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. బీఎంసీ సర్క్యులర్‌ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సర్క్యులర్‌ను జాగ్రత్తగా పరిశీలించామని అది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని బెంచ్ గుర్తించింది. నగరంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్న విషయం వాస్తవమేనని, ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించింది.