Bomb threats: ఏడు విమానాలకు బాంబు బెదిరింపు.. ఢిల్లీ-చికాగో విమానం కెనడాకు మళ్లింపు
ఏడు భారతీయ విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎక్స్ ద్వారా అన్ని విమానాలకు హెచ్చరికలు వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఏడు భారతీయ విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా అన్ని విమానాలకు హెచ్చరికలు వచ్చాయి. డిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మాం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ ఫ్లైట్, సిలిగురి-బెంగళూరు అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్తున్న ఒక విమానానికి హెచ్చరికలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. అనంతరం వార్నింగ్స్ బూటకమని తేల్చాయి. ఎక్స్‌లో ఒకే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని బాంబు బెదిరింపుల నేపథ్యంలో కెనడాకు మళ్లించారు. కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయంలో ల్యాండైన తర్వాత ప్రయాణికులను, వారి లగేజీని తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానిత పరికరాలు లభ్యం కావడంతో తిరిగి సర్వీసులు ప్రారంభించారు. జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను అయోధ్యలో అత్యవసర ల్యాండ్ చేసి సోదాలు చేపట్టారు. మిగతా విమానాలను సైతం ఆయా ప్రాంతాల్లో సోదాలు చేశారు. కాగా, సోమవారం కూడా ముంబై నుంచి వచ్చే మూడు అంతర్జాతీయ విమానాలకు ఇదే తరహాలో బెదిరింపులు రావడం గమనార్హం.