దేవేంద్ర ఫడ్నవీస్‌కు అజిత్ పవార్ షాక్..

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం జరగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

Update: 2023-07-13 12:03 GMT

ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం జరగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎంగా చేరిన అజిత్ పవార్‌కు కీలక మంత్రి పదవిని కేటాయించనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వద్దనున్న ఆర్థిక శాఖను త్వరలో అజిత్ పవార్‌కు కేటాయిస్తారని సంబంధిత వర్గాలు చెప్పాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి తన వెంట వచ్చిన ఎన్సీపీ ఎమ్మెల్యేలలో పలువురు సీనియర్లకు ప్రణాళిక, సహకార శాఖలను ఇవ్వాలంటూ షిండే, ఫడ్నవీస్‌లతో అజిత్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఒకసారి (జూలై 10, 1 తేదీల్లో) జరిగిన చర్చల్లో ఈ అంశాలను అజిత్ పవార్ లేవనెత్తారని అంటున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన ఎన్‌సీపీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవద్దని బీజేపీ ఎమ్మెల్యేలు, ఏక్ నాథ్ షిండే తో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ వర్గాల మధ్య కోల్డ్ వార్‌ను సృష్టిస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ ఖండించారు. ఈ నెల 18న తాము(ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు.


Similar News