మధ్యప్రదేశ్ ఘటనతో బీజేపీ అసలు ముఖం బయటపడింది : Rahul Gandhi

బీజేపీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు.

Update: 2023-07-05 11:28 GMT

న్యూఢిల్లీ : బీజేపీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నాయకుడిగా చెప్పబడుతున్న ఓ వ్యక్తి గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన.. ఆదివాసీలు, దళితులపై బీజేపీకి ఉన్న ద్వేషానికి నిదర్శనమన్నారు. సిధి జిల్లాలో జరిగిన ఈ అమానవీయ చర్యతో బీజేపీ అసలు ముఖం బట్టబయలైందని పేర్కొన్నారు. ఈమేరకు రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్‌ చేశారు.

బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో గిరిజనులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా స్పందించారు. మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడితో బీజేపీ ఎమ్మెల్యే సన్నిహితుడు అమానుషంగా ప్రవర్తించాడని మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో గత 18 ఏళ్ల బీజేపీ పాలనలో 30,400 గిరిజన అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రియాంక ప్రశ్నించారు.


Similar News