శాంతను సిన్హాపై అమిత్ మాల్వియా పరువునష్టం దావా
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శాంతను సిన్హా అనే వ్యక్తిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శాంతను సిన్హా అనే వ్యక్తిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సమయంలో మాల్వియా మహిళలను లైంగికంగా వేధించారని పేర్కొంటూ పేర్కొంటూ శాంతను సిన్హా సోషల్ మీడియాలో ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. అందులో తనను తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పరిచయం చేసుకున్నారు. ‘‘బెంగాల్‌లోని పలు బీజేపీ ఆఫీసులు, 5 స్టార్ హోటళ్లు వేదికగా మహిళలను మాల్వియా వేధించారు. అమిత్ మాల్వియా వంటి నాయకుల దగ్గరికి మహిళలను పంపి బెంగాల్ బీజేపీ నాయకులు తమ పార్టీ పదవులను నిలుపుకుంటారా ? అమిత్ మాల్వియాను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పదవి నుంచి తొలగించి, దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటికొస్తాయి’’ అని శాంతను ఆరోపించారు. ‘‘బెంగాల్‌లో రాజకీయాలతో సంబంధంలేని సినీనటులకు టికెట్లు దక్కాయి. నేను ఇప్పటికి నా ఆరోపణలకు కట్టుబడి ఉంటాను. బెంగాల్ లోని కొందరు నాయకులు అమ్మాయిలను పంపించి తమ పదవుల్లో కొనసాగుతున్నారు” అని ఆయన కామెంట్ చేశారు. అయితే శాంతాను సిన్హాకు తమ సంస్థతో ఎలాంటి అధికారిక సంబంధాలు లేవని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.
అమిత్‌పై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్
అమిత్ మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని బెంగాల్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రినతే డిమాండ్ చేశారు. మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన 24 గంటల్లోనే ఈ ఆరోపణలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. అమిత్ మాల్వియా లాంటి వాళ్లను పార్టీలో కొనసాగిస్తే బీజేపీ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందన్నారు.