బీజేపీ అభ్యర్థుల ఎనిమిదో జాబితాలోని ప్రముఖులు వీరే

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను శనివారం విడుదల చేసింది.

Update: 2024-03-30 18:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 11 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్ నుంచి ఆరుగురు, ఒడిశా నుంచి ముగ్గురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు నేతలకు బీజేపీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్ పూర్ నుంచి బాలీవుడ్ నటుడు సన్నీ దేవల్‌ను బరిలో నిలిపిన బీజేపీ, ఈసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఆ స్థానం నుంచి దినేష్‌ సింగ్‌ బబ్బును బరిలోకి దించింది. ఇటీవల బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక లోక్‌సభ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ రింకూకు సిట్టింగ్ స్థానం జలంధర్‌‌ను కాషాయ పార్టీ కేటాయించింది. సస్పెన్షన్ వేటు పడిన కాంగ్రెస్‌ ఎంపీ, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ పాటియాలా నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మాజీ మంత్రిగా సేవలు అందించిన ప్రణీత్ కౌర్ ఈ నెల ఆరంభంలోనే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అమృత్‌సర్‌ నుంచి మాజీ దౌత్యవేత్త తరంజిత్‌ సింగ్‌ సంధూ, ఫరీద్‌కోట్‌ నుంచి హన్స్‌ రాజ్‌ హన్స్‌ తలపడనున్నారు. హన్స్ రాజ్ హన్స్ ప్రస్తుతం ఢిల్లీలోని వాయవ్య (నార్త్ వెస్ట్) అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి బీజేపీ అధిష్టానం ఆయనను పంజాబ్ రాజకీయాల్లోకి పంపింది.

ఒడిశా, బెంగాల్ అభ్యర్థులు వీరే

ఇటీవలే బిజూ జనతాదళ్‌ (బీజేడీ)కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ కటక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డుకు ఆయనకు ఉంది. రవీంద్ర నారాయణ్ బెహ్రా జాజ్‌పూర్ నుంచి, సుకాంత కుమార్ పాణిగ్రాహి కంధమాల్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ నుంచి ప్రణత్ తుడు, బీర్భూమ్ నుంచి దేవాశిష్ ధార్ బరిలోకి దిగుతున్నారు. దేవాశిష్ ఇటీవల ఐపీఎస్‌కు రాజీనామా చేసి మరీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.బీజేపీ తాజాగా విడుదల చేసిన 8వ జాబితాను కలుపుకొని వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాషాయ పార్టీ మొత్తం 418 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Tags:    

Similar News