9 ఏళ్ల పాలన పూరైన నేపథ్యంలో బీజేపీ దేశ వ్యాప్తంగా ర్యాలీలు

కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా భారీగా ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

Update: 2023-05-15 16:43 GMT

న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా భారీగా ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించనున్న ఈ క్యాంపెయిన్.. దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేయనుంది. ఈ క్యాంపెయిన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించి, వరుసగా రెండు రోజులపాటు(ఈ నెల 30, 31న) ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

మొత్తంగా బీజేపీ సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అగ్రనేతలు, సీనియర్ నాయకులు కలిసి దేశవ్యాప్తంగా 51 ర్యాలీలు, 396 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందులో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 250 కుటుంబాలను నేరుగా కలవనున్నారు. ఇందులో క్రీడాకారులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, యుద్ధవీరులు వంటి ప్రముఖులతో బీజేపీ నేతలు ముచ్చటిస్తారు.

పలు దఫాలుగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కాగా, 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగా, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లోనూ మోడీ నేతృత్వంలోని బీజేపీయే విజయం సాధించి, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News